Monday, December 14, 2009

మేమింతే...

తెల్లవాడు పోతూ పోతూ
మనని చూసి నవ్విపోయే ఉంటాడు...
రెండు రోజులయినా గడవక ముందే
ముక్కలయిపోయిన మన ఐకమత్యాన్ని చూసి
జాలితో అయినా నవ్విపోయే ఉంటాడు...

అయినా
ఏనాడు కలిసున్నామని ఈనాడు విడిపోతున్నాం.....

తెల్లవాడి ఉక్కుపాదం కింద
మనమంతా కలిసి నలిగిపోతున్నప్పుడా.....
కులమత భేదాల్లేకుండా వాడు
మన మానప్రాణాలని దోచేస్తున్నప్పుడా......
వాడెళ్తూ మనల్ని రెండుగా విడదీసినప్పుడా.....
విచక్షణ లేకుండా మారణహోమపు మంటల్లో
మనల్ని మనమే కాల్చుకుంటున్నప్పుడా.......

ఏనాడు కలిసున్నామని ఈనాడు విడిపోతున్నాం.......
మతం పేరుతో మనిషికి మనిషే
మృత్యువుగా మారినప్పుడా.....

ప్రాంతం పేరుతో పరాయి దేశపు
సైనికుడిలా పగపట్టినప్పుడా.....
కులపు కక్షలతో కంటిమీద
కునుకు లేకుండా కత్తులు దూసుకున్నప్పుడా.....

ఏనాడు కలిసున్నామని ఈనాడు విడీపోతున్నాం....
భారతీయుడినని చెప్పాల్సిన చోట

దక్షిణభారతీయుడినంటున్నాం...
తెలుగువాడినని గర్వంగా చెప్పాల్సినపుడు
తెలంగాణావాదిననో, సీమబిడ్డననో,
కోస్తా పులిననో చెప్పుకుంటున్నాం
ఆ తెల్లోడు మళ్ళీ వచ్చి
మనల్నిబానిస బ్రతుకుల్లోకి నెట్టేదాకా...
వాడి ఉక్కు పాదాల కింద
మనమంతా తేడాలేకుండా నలిగేదాకా....
మరో స్వాతంత్ర్య సమరం దాకా...
మళ్ళీ మనం కలిసే దాకా....
మనం విడిపోయే ఉంటాం,మన అస్తిత్వాన్ని కోల్పోతూనే ఉంటాం...